సినీ ఫీల్డులో ఎంత గొప్పవాళ్లకైనా కష్టాలు తప్పవు. ఫ్లాపులతో సతమతమవక తప్పదు. మెగాస్టార్ చిరంజీవి సైతం అందుకు అతీతుడు కాదు. 1978లో 'ప్రాణం ఖరీదు'తో కెరీర్ మొదలుపెట్టిన చిరంజీవి, 1983లో వచ్చిన 'ఖైదీ'తో స్టార్‌గా మారారు. అప్పట్నుంచీ ఒక దశాబ్ద కాలం ఆయనకు తిరుగనేదే లేకుండా పోయింది. ఈ మధ్యలో ఆయన మెగాస్టార్‌గా కూడా బాక్సాఫీసును అనేక సార్లు బద్దలు కొడుతూ వచ్చారు. కానీ ఆ తర్వాత మూడేళ్ల కాలం ఆయన కెరీర్‌లో ఒక పీడకలగా మారింది.
1993లో రిలీజైన 'ముఠామేస్త్రి' మూవీ తర్వాత ఆయన చేసిన సినిమాలు ఒక దాని తర్వాత ఒకటిగా ఫ్లాపవుతూ వచ్చాయి. 'మెకానిక్ అల్లుడు', 'ముగ్గురు మొనగాళ్లు', 'ఎస్.పి. పరశురాం', 'బిగ్ బాస్', 'రిక్షావోడు' సినిమాలు బాక్సాఫీస్ దగ్గర గల్లంతయ్యాయి. 'బిగ్ బాస్' కంటే ముందు వచ్చిన 'అల్లుడా మజాకా' సినిమా ఫర్వాలేదనిపించుకున్నా బూతు సినిమాగా దానికి వచ్చిన పేరు, అత్త కేరెక్టర్ చేసిన లక్ష్మితో చిరంజీవి చేసిన సరసాలు విపరీతమైన విమర్శలనీ, కాంట్రవర్సీనీ సృష్టించాయి. ఇది మెగాస్టార్‌గా ఆయన సాధించుకున్న ప్రతిష్ఠకు మచ్చ తెచ్చింది.
'రిక్షావోడు' డిజాస్టర్‌తో ఆయన పునరాలోచనలో పడ్డారు. తర్వాత ఎలాంటి సబ్జెక్టును ఎంచుకోవాలో పాలుపోని స్థితిని ఎదుర్కొని, ఏడాది పాటు ఖాళీగా ఉండిపోయారు. నిజంగా అది మెగాస్టార్‌కు సంకట స్థితే. ఆ టైంలో ఆయన దృష్టికి వచ్చింది ఒక మలయాళీ సినిమా. అది మమ్ముట్టి టైటిల్ రోల్ చేసిన 'హిట్లర్'. ఐదుగురు చెల్లెళ్లకు అన్నగా మమ్ముట్టి చేసిన నటన, కథలోని సెంటిమెంట్ ఆ సినిమాని హిట్ చేశాయని అర్థం చేసుకున్న చిరంజీవి.. ఆ కథ తనకు సరిపోతుందని భావించారు. ఆయన బావమరిది, సన్నిహితుడు అల్లు అరవింద్ సైతం ఆయనను సపోర్ట్ చేశారు. నిర్మాత ఎడిటర్ మోహన్ ఆ సినిమాని రీమేక్ చేసేందుకు ముందుకు వచ్చారు. అయితే ఆ సినిమాకి డైరెక్టర్‌గా ఎవర్ని ఎంచుకోవాలనే సమస్య ఎదురైంది.
అప్పట్లో సెంటిమెంట్ సినిమాలు చేసి, విజయాలు అందుకున్న ముత్యాల సుబ్బయ్య పేరును చిరంజీవికి సూచించారు ఎడిటర్ మోహన్. అప్పటికే ఆయన బేనర్‌లో ముత్యాల సుబ్బయ్య 'మామగారు' వంటి సెంటిమెంట్ సినిమాని డైరెక్ట్ చేసి హిట్ కొట్టారు. పైగా అదే సమయంలో వెంకటేశ్, సౌందర్య జంటగా ఆయన రూపొందించిన 'పవిత్ర బంధం' సూపర్ హిట్టయింది. ఈ విషయాలు ఎడిటర్ మోహన్ చెప్పగానే చిరంజీవి, అరవింద్ కూడా సరేనన్నారు. అలా చిరంజీవి, ముత్యాల సుబ్బయ్య తొలి కాంబినేషన్‌లో మలయాళ 'హిట్లర్' తెలుగు రీమేక్ అదే టైటిల్‌తో రూపొందింది.
ఆ సినిమా మేకింగ్‌లో ఉన్నప్పుడు చిరంజీవి ఫ్యాన్స్ నుంచి బెదిరింపుల్లాంటి ఉత్తరాలు అందుకున్నారు ముత్యాల సుబ్బయ్య. "మా బాస్ సినిమాని డైరెక్ట్ చేస్తున్నారు. ఆయన్ని బాగా చూపించాలి, ఒళ్లు దగ్గర పెట్టుకొని చేయండి" అనేది ఆ ఉత్తరాల్లోని సారాంశం. అయితే వాటికి సుబ్బయ్య భయపడలేదు. తనేం తీస్తున్నననే విషయంలో ఆయనకు క్లారిటీ ఉంది. సబ్జెక్టుపై కాన్ఫిడెన్స్ ఉంది. టైటిల్ రోల్‌ను చిరంజీవి బ్రహ్మాండంగా చేశారు. సెంటిమెంట్‌ను బాగా పండించారు. దానికి కామెడీ జోడై, మూవీ సూపర్ హిట్టయింది. ఎంత హిట్టంటే ఒరిజినల్ కంటే, తమిళ, కన్నడ, హిందీ రీమేక్స్ కంటే పెద్ద హిట్టు. అలా మూడేళ్ల మెగాస్టార్ కెరీర్ స్లంప్‌కు 'హిట్లర్' చెక్ పెట్టేసింది.
అలా మెగాస్టార్ కెరీర్‌లో సెకండ్ ఇన్నింగ్స్ మొదలైంది. ఆయన కెరీర్‌ను గాడిలో పెట్టిన డైరెక్టర్‌గా ముత్యాల సుబ్బయ్య, ప్రొడ్యూసర్‌గా ఎడిటర్ మోహన్ పేరు తెచ్చుకున్నారు. అంతేకాదు.. చిరంజీవి నుంచి మొబైల్ ఫోన్‌ను గిఫ్ట్‌గా కూడా అందుకున్నారు. అవును. అప్పుడప్పుడే మొబైల్ ఫోన్లు వస్తున్నాయి. ఖరీదైన అవి పెద్ద పెద్ద వాళ్ల దగ్గర మాత్రమే ఉండేవి. ముత్యాల సుబ్బయ్య వాడిన తొలి మొబైల్ ఫోన్ మెగాస్టార్ ఇచ్చిన కానుకే! ఇటీవల వచ్చి, ప్రేక్షకాదరణను పొందిన చిరంజీవి మూవీ 'గాడ్‌ఫాదర్' డైరెక్టర్ మోహన్ రాజా మరెవరో కాదు.. స్వయానా ఎడిటర్ మోహన్ తనయుడే!
(నేడు ఎడిటర్ మోహన్ జన్మదినం సందర్భంగా...)